కార్తి చిదంబరం రూ.50 లక్షల లంచం తీసుకున్నారు: ఈడీ
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం తనయుడు కార్తి చిదంబరంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా పౌరులకు అక్రమంగా భారతదేశ వీసా అనుమతులు ఇప్పించారని, అందుకోసం రూ.50 లక్షలు లంచంగా పొందారని ఆరోపించింది. అది కూడా ఓ సన్నిహితుడి నుంచి కార్తీ చిదంబరం ఈ మొత్తాన్ని అందుకున్నారని, ఆ నగదును ఆయన డైరెక్టర్గా ఉన్న ఓ కంపెనీకి మళ్లించారని ఆరోపించింది.
చైనాకు చెందిన 250 మందికి అక్రమంగా వీసాలు ఇప్పించారని, అందుకోసం భారీగా నగదు తీసుకున్నారనేది కార్తి చిదంబరంపై ప్రధాన ఆరోపణ. ఆయన తండ్రి కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలోనే కార్తి ఈ నేరానికి పాల్పడినట్లు సీబీఐ వెల్లడించింది. అలాగే ఈ కేసులో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు కూడా నిర్వహించింది. అలాగే కార్తి చిదంబరం సన్నిహితుడు, ఈ కేసుతో సంబంధం ఉన్న భాస్కరరామన్ను సీబీఐ ఈ మధ్యనే అదుపులోనికి తీసుకుంది.
ప్రస్తుతం తమిళనాడులోని శివగంగా లోక్సభ స్థానం ఎంపీగా ఉన్న కార్తి చిదంబరాన్ని ఇదే కేసులో ఇప్పటికే ఈడీ పలుమార్లు విచారించింది. ఆయన స్టేట్మెంట్లను కూడా రికార్డు చేసింది. అనంతరం ఇటీవల దాఖలు చేసిన ఛార్జిషీట్లో కార్తితోపాటు ఆయన సన్నిహితుడు భాస్కరరామన్పై ఈడీ ఈ అభియోగాలు మోపింది.
ఇదిలా ఉంటే అక్రమ వీసా కేసులో ప్రాసిక్యూషన్ ఫిర్యాదుపై మార్చి 19న ఢిల్లీలోని పీఎంఎల్ఏ న్యాయస్థానం విచారణ జరిపింది. విచారణ అనంతరం ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తి చిదంబరంతోపాటు ఇతర నిందితులు ఏప్రిల్ 15న కోర్టు ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.













