సందేశ్‌ఖాలీ నిందితుడు షాజహాన్‌ను అరెస్ట్ చేసిన ఈడీ
తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత, సందేశ్‌ఖలీ నిందితుడు షాజహాన్ షేక్‌ను శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ మేరకు ఈడీ స్వయంగా ప్రకటించింది. మనీలాండరింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. ఫిబ్రవరిలో రేషన్ కుంభకోణం కేసులో షాజహాన్‌ను విచారించేందుకు సందేశ్‌ఖలీకి వెళ్లిన ఈడీ అధికారులపై అతడి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో షాజహాన్ పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు.
ఈ నేపథ్యంలోనే షాజహాన్ చేసిన చీకటి దారుణాలన్నీ బయటపడ్డాయి. సందేశ్‌ఖలీ వ్యాప్తంగా మహిళలు షాజహాన్ చేస్తున్న అక్రమాలకు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలకు దిగారు. అదే సమయంలో షాజహాన్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ నమోదైన భూకబ్జాలు, మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు కూడా బయటకొచ్చాయి. ఇక ఆందోళన చేస్తున్న మహిళలు వెంటనే షాజహాన్‌ను అరెస్ట్ చేయాలంటూ తీవ్ర ఆందోళనలకు దిగారు.
కోర్టు కూడా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 55 రోజులుగా పరారీలో ఉన్న షాజహాన్‌ను అరెస్ట్ చేసే అధికారం సీబీఐ, ఈడీకి కూడా ఉందని కలకత్తా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పరిస్థితి మారిపోయింది. అత్యంత నాటకీయ పరిస్థితుల్లో బెంగాల్ పోలీసులే హుటాహుటిన షాజహాన్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు అతడిని సీబీఐ కస్టడీకి అప్పగించింది. టీఎంసీ కూడా పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు షాజహాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా బసిర్హత్ జైలులో సీబీఐ కస్టడీలో ఉన్న షాజహాన్ని.. మనీలాండరింగ్ కేసుల్లో విచారించిన ఈడీ.. ఆ తర్వాత అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఇక సోమవారం అతడిని బసిర్హత్ కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ.. ఆ తర్వాత రిమాండ్ కోసం కోరే అవకాశాలున్నాయి.













