ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగం పెంచింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసింది. అంతకు ముందు అక్కడ సోదాలు నిర్వహించడంతో పాటు కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకుని ఢిల్లీ లోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో దర్యాప్తు సంస్థ చేపట్టిన ఈ చర్యను ఆప్ నేతలతో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండిరచాయి. కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారుల బృందం చేరుకున్నప్పుడు ఒక దశలో తీవ్ర ఉద్రికత్త ఏర్పడింది. ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే దారులన్నింటినీ ఢిల్లీ పోలీసులు మూసివేశారు. కీలకమైన పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేయగా, అరెస్టయినప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ ప్రకటించారు. అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని అన్నారు.













