కేంద్ర ఎన్నికల సంఘం కొత్త రూల్స్… రాత్రి 7 దాటితే
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్ తదుపరి మూడు దశల ఎన్నికల ప్రచారానికి కొత్త రూల్స్ పెట్టింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు రాజకీయ పార్టీలు ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపింది. దీంతో పాటు సైలెన్స్ పీరియడ్‌ను 48 గంటల నుంచి 72 గంటల వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. ప్రచారంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులే మాస్క్ లు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.
కొవిడ్ రెండో విజృంభణ నేపథ్యంలో అసాధారణ పరిస్థితులు నెలకొనడంతో ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ భౌతికదూరం, మాస్క్ లు ధరించడం వంటి నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది. ప్రచార సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించేలా జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించింది.













