ఆప్‌కు జాతీయ హోదా ఇచ్చి.. మూడు బడా పార్టీలకు షాకిచ్చిన ఈసీ
దేశంలో జాతీయ పార్టీల గుర్తింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు జాతీయ హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో మూడు జాతీయ పార్టీలకు గట్టి షాక్ ఇచ్చింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), సీపీఐకి దిమ్మతిరిగే షాకిచ్చింది. ఈ మూడు పార్టీల జాతీయ హోదాను తొలగించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును కూడా తొలగించింది. 2012లో స్థాపించిన ఆప్ మొదట ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల రాష్ట్రాల ఎన్నికల్లో కూడా పాల్గొంటూ వచ్చింది. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో గెలిచి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. గుజరాత్ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలవడంతోపాటు 12 శాతం ఓట్లు కూడా సాధించింది. దీంతో జాతీయ పార్టీకి ఉండాల్సిన అర్హతలన్నింటినీ సంపాదించింది.













