కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఆ 5 రాష్ట్రాల్లో
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐదు రాష్ట్రాల్లో ఫిజికల్ ర్యాలీలు, రోడ్షోలపై నిషేధాన్ని మరోసారి ఎన్నికల కమిషన్ (ఈసీ) పోడిగించింది. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని కోవిడ్ పరిస్థితిపై ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే సమగ్ర సమీక్ష జరిపారు. అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు. ఫిబ్రవరి 11వ తేదీ వరకూ నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితి సమీక్షించిన అనంతరం ఫిజికల్ ర్యాలీలపై నిషేధం పోడిగించాలని నిర్ణయించినట్టు తెలిపింది.
అధికారుల అనుమతితో నిర్ణీత ప్రదేశాల్లో బహిరంగ సభలకు గతంలో 500 మందికి మాత్రమే అనుమతించిన ఈసీ, ఈసారి ఆ సంఖ్యను 1000కి పెంచింది. అలాగే, ఇంటింటి ప్రచారానికి 20 మంది వరకు బృందంగా వెళ్లొచ్చని స్పష్టం చేసింది. ఇండోర్లలో జరిగే సమావేశాలకు గతంలో 300 మందికి మించరాదని పరిమితి విధించిన ఈసీ ఈసారి ఆ సంఖ్య 500వరకు పెంచింది. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.













