కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. విజయోత్సవ ర్యాలీలపై
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కేంద్ర పాలిత ప్రాంతం సహా తమిళనాడు, కేరళ, అసోంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తికాగా.. పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్నాయి. అలాగే పలు రాష్ట్రాల్లోనూ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మే 2వ తేదీన ఎన్నికల ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలపై ఆంక్షలు విధించింది.
ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఎలాంటి సంబరాలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది. విజేతలుగా నిలిచిన అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకునే సమయంలో వారి వెంటనే ఇద్దరు మించి ఉండరాదని ఆదేశించింది. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే ఈసీ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కొన్ని రోజుల క్రితం బెంగాల్ లో ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా ఈసీ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.













