విజయోత్సవాలపై ఈసీ నిషేధం… కానీ
దేశమంతటా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజుకు నాలుగు లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. అయినా సరే పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అసోం, రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవాలు నిర్వహించకుండా మాత్రం ఈసీ నిషేధం విధించింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు ఎలాంటి సంబరాలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది. అంతేగాక, విజేతలుగా నిలిచిన అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకునే సమయంలో వారి వెంట ఇద్దరు మించి ఉండరాదని ఆదేశించింది. కానీ ఈసీ ఆదేశాలు జనం బేఖాతారు చేశారు. ఈసీ ఆదేశాలను అస్సలు పట్టించుకోకుండా జనం విజయోత్సవాల్లో మునిగి తేలారు.
తమిళనాడులో డీఎంకే శ్రేణులు జోరుగా సంబురాలు జరుపుకున్నారు. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు, తమ అభిమాన నేతల ఇండ్ల ముందు గుంపులుగా చేరి నృత్యాలు చేశారు. ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుంటున్నారు. ఈ ఆదేశాలను లెక్కచేయకపోవడమే గాక, మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం అనే కొవిడ్ నిబంధనలను కూడా తుంగలో తొక్కారు.













