ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపుర్, గోవా రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటిచింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తున్నామని తెలిపారు. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 690 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభల గడువు మార్చితో ముగియనుండగా,
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు మే నెలతో పూర్తవుతుంది. యూపీలో 403 శాసనసభ నియోజకవర్గాలుండగా ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది.
ఈ సందర్భంగా సీఈసీ సుశీల్ చంద్ర మాట్లాడుతూ కొవిడ్ 19 మహమ్మారి వల్ల ఎన్నికల నిర్వహణ భారీ సవాలుగా నిలుస్తోందని అన్నారు. ఈ ఎన్నికలను కోవిడ్ రహిత ఎన్నికలుగా నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లోని 690 నియోజకవర్గాల్లో కొవిడ్ రహిత, సురక్షిత ఎన్నికలను నిర్వహించడమే తమ లక్ష్యమని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో తొలిసారి ఓటు వేయబోతున్నావారు 24.9 లక్షల మంది అని తెలిపారు. 11.4 లక్షల మంది మహిళలు తొలిసారి ఓటు వేయబోతున్నట్లు తెలిపారు. 16 శాతం పోలింగ్ కేంద్రాలను పెంచుతున్నట్లు తెలిపారు. మొత్తం పోలింగ్ బూత్‌ల సంఖ్య 2.16 లక్షలు అని తెలిపారు. ఒక్కొక్క పోలింగ్ బూత్‌కు ఓటర్ల సంఖ్యను 1.250కి తగ్గించినట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్ లో కూడా నామినేషన్లను దాఖలు చేయవచ్చునని తెలిపారు. కోవిడ్ పాజిటిట్ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు వేయవచ్చునని తెలిపారు.













