ఆ కార్లు భారత్ లోకి ఎప్పటికీ రావు.. రానీయను
డ్రైవర్‌లెస్ కార్లను భారత్‌లోకి అనుమతించబోమని కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రహదారి భద్రతపై ఐఐఎమ్ నాగ్‌పూర్‌లో జీరో మైల్ సంవాద్ పేరిట జరిగిన కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ఆ కార్ల వల్ల డ్రైవర్లు ఉపాధి కోల్పోతారు. అది ఎప్పటికీ జరగనివ్వను. భారత్‌లో టెస్లా అమ్మకాలు చేపట్టేందుకు అనుమతిస్తాం. కానీ, చైనాలో కార్లను తయారు చేసి, భారత్‌లో విక్రయించేందుకు అంగీకరించం అని అన్నారు. భవిష్యత్తు ఇంధనంగా హైడ్రోజన్ ప్రాముఖ్యతను తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను అందించేందుకు అధునాతన సాంకేతికతను స్వీకరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.













