నన్ను భారత్‌కు అప్పగించొద్దు…
పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి భారత్ నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించారు. తనను భారత దేశానికి అప్పగించాలని క్రింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను బ్రిటన్ హోం సెక్రటరీ ఆమోదించడాన్ని సవాలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఆయనను భారత దేశానికి అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఏప్రిల్ 15న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తన మానసిక స్థితి సరిగా లేదని, ఈ పరిస్థితుల్లో తనను భారత్‌కు అప్పగిస్తే న్యాయం జరగదని, అందువల్ల తనను భారత్‌కు అప్పగించవద్దని కోరారు. బ్రిటన్ హోంశాఖ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ నీరవ్ మోదీని భారత దేశానికి అప్పగించాలని డిస్ట్రిక్ట్ జడ్జి ఫిబ్రవరి 25న తీర్పు చెప్పినట్లు తెలిపారు. భారత దేశానికి అప్పగించేందుకు ఏప్రిల్ 15న ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును నీరవ్ మోదీ దాదాపు రూ.14 వేల కోట్ల మేర మోసం చేశాడు. అనంతరం యునైటెడ్ కింగ్డమ్కు పారిపోయాడు. ఈ కేసుల విచారణ జరుపుతున్న సీబీఐ అప్పటి నుంచి నీరవ్‌ను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇటీవలే యూకే హోంశాఖ నీరవ్‌ను భారత్‌కు అప్పగించేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో తనను భారత్‌కు అప్పగించవద్దంటూ నీరవ్ మోదీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ప్రస్తుతం నీరవ్ మోదీ బ్రిటన్‌లోని వాండ్స్‌వర్త్ జైల్లో ఉన్నాడు.













