Digvijay Singh: మరో సీనియర్ నేత ధిక్కార స్వరం.. మోడీపై దిగ్విజయ్ సింగ్ ట్వీట్
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇప్పటికే ప్రధాని మోడీని సీనియర్ ఎంపీ శశిథరూర్ ప్రశంసించడంపై అధిష్టానం గుర్రుగా ఉండగా, తాజాగా మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) చేసిన సోషల్ మీడియా పోస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సరిగ్గా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం జరుగుతున్న సమయంలోనే దిగ్విజయ్ సింగ్ ఈ పోస్టు పెట్టడం గమనార్హం. 1990ల నాటి ఒక ఫోటోను షేర్ చేసిన దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh).. అందులో అద్వానీ వంటి అగ్రనేతలు కుర్చీల్లో కూర్చొని ఉండగా, సామాన్య కార్యకర్త అయిన నరేంద్ర మోడీ.. మిగతా వారితో కలిసి నేలపై కూర్చుని ఉండటాన్ని ప్రస్తావించారు.
“ఒక సాధారణ కార్యకర్త దేశ ప్రధానిగా ఎదగడం ఆర్ఎస్ఎస్/బీజేపీ వ్యవస్థలోని గొప్పతనం” అంటూ పరోక్షంగా బీజేపీ నిర్మాణాత్మక శక్తిని కొనియాడారు. ఇది పరోక్షంగా గాంధీ కుటుంబ వారసత్వ రాజకీయాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కూడా రాహుల్ గాంధీ తీరుపై, పార్టీలో అధికార వికేంద్రీకరణ జరగకపోవడంపై దిగ్విజయ్ (Digvijay Singh) బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్‌ను ఒప్పించడం అంత సులభం కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. తాజా పోస్టుతో బీజేపీ నేతలు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాను కేవలం వ్యవస్థను మాత్రమే మెచ్చుకున్నానని దిగ్విజయ్ వివరణ ఇచ్చినప్పటికీ.. కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం అయోమయం నెలకొంది.






