కాంగ్రెస్ అధ్యక్ష రేసులో లేను.. స్పష్టం చేసిన దిగ్విజయ్ సింగ్
వచ్చే నెలలో కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీపడటం లేదని రాహుల్‌గాంధీ చెప్పేశారు. దీంతో ఈ రేసులో కొందరు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారని సమాచారం. వీరిలో ఇప్పటికే తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్ ప్రకటించారు. ఆయనతోపాటు సీనియర్ నేతలు శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ కూడా ఎన్నికల బరిలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దిగ్విజయ్‌సింగ్ క్లారిటీ ఇచ్చారు. జబల్పూర్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. తాను పార్టీ అధ్యక్ష పదవి రేసులో లేనని తేల్చేశారు. అదే సమయంలో పార్టీ ఉన్నతస్థాయి నేతలు ఇచ్చే ఆదేశాలు, సూత్రాలను మాత్రం తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పారు. కాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరుగుతాయి. వీటి ఫలితాలను అక్టోబర్ 19న వెల్లడిస్తారు. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లు వేసే అవకాశం ఉంది.













