రేపు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనున్న దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో తాను లేనని కొన్నిరోజుల క్రితం తేల్చిచెప్పిన మధ్యప్రదేశ్ కీలకనేత దిగ్విజయ్ సింగ్.. అనూహ్యంగా యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. అశోక్ గెహ్లాట్ వర్గం వల్ల రాజస్థాన్ కాంగ్రెస్ లో రగడ జరుగుతున్న నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ ఈ ఎన్నికల్లో నిలబడుతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే నామినేషన్ పత్రాల్ని తీసుకునేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. అధ్యక్ష పదవి కోసం తాను రేపు నామినేషన్ వేయనున్నట్లు గురువారం నాడు ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ 17వ తేదీన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 75 ఏళ్ల వయసున్న దిగ్విజయ్ సింగ్ గతంలో మధ్యప్రదేశ్ సీఎంగా సేవలందించారు. పార్టీలో గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. కేరళ ఎంపీ శశిథరూర్ కూడా అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్నారు. థరూర్ శుక్రవారం నాడు తన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా నామినేషన్ వేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. పార్టీ నేతల్లో ఆయనపై అసహనం ఉన్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రగడ వెనుక గెహ్లాట్ హస్తం ఉందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ గొడవ కారణంగా అధ్యక్ష రేస్ నుంచి గెహ్లాట్ ను తప్పించినా ఆశ్చర్యం లేదు.













