బీజేపీకి మరో పెద్ద షాక్… పార్టీని వీడనున్న మాజీ సీఎం
అసెంబ్లీ ఎన్నికల వేళ గోవాలో బీజేపీకి మరో పెద్ద షాక్ తగిలింది. పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీలోని పదవులన్నింటికీ రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. మాండ్రెం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. నాకు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవచ్చు. నావద్ద ప్రజల టిక్కెట్ ఉంది. ప్రజలు పోటీ చేయమని కోరుకుంటున్నారు. అందుకోసం నేను సిద్ధమవుతున్నాను. పార్టీకి చెందిన పెండిరగ్లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు రెండు రోజులు సమయం కోరాను. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను అని పర్సేకర్ మీడియాకు తెలిపారు. 2019లో పర్సేకర్ బీజేపీలో చేరారు. లక్ష్మికాంత్ పర్సేకర్ 2014`17 వరకు గోవా ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఈ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు.













