మళ్లీ బీజేపీకి షాకిచ్చిన ఢిల్లీ ప్రజలు
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి గుబులు పుట్టించాయి. ఢిల్లీ కార్పొరేషన్‌కు చెందిన ఐదు వార్డుల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ ఒక్కటంటే ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయింది. షాలీమార్ బాగ్ నార్త్, కల్యాణ్‌పుర, త్రిలోక్పుర, రోహిణీసీ వార్డుల్లో ఆప్ అభ్యర్థులే గెలుపొందారు. ఒక్క చౌహాన్ బాంగర్ లో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. ఇలా ఒక్క సీటూ గెలుచుకోలేకపోవడంతో బీజేపీ శ్రేణులు ఇరకాటంలో పడిపోయారు. ఈ ఓటమిపై బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు అదేశ్ గుప్తా స్పందించారు. ఫలితాలను సమీక్షిస్తామని, వ్యూహంలో అవసరమైన మార్పులు చేసుకుంటామని ప్రకటించారు.
ఘాటుగా స్పందించిన సీఎం కేజ్రీవాల్
మరోసారి ఆమ్ఆద్మీపైన ప్రజలు మరోసారి తమ నమ్మకాన్ని చాటుకున్నారని సీఎం కేజ్రీవాల్ అన్నారు. తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంతో బీజేపీ వ్యవహరించిన తీరు ఢిల్లీ ప్రజలకు ఏమాత్రం నచ్చడం లేదని మండిపడ్డారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. కొన్ని సంవత్సరాల పాటు బీజేపీని సున్నాకే పరిమితం చేశారని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఎంసీడీని బీజేపీ అవినీతి శాఖగా మార్చేసిందని, తమ ద్వారా ప్రక్షాళన జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 2015 లో 70 సీట్లకు గాను తాము 67 సీట్లను కైవసం చేసుకున్నామని, 2020లో 70 సీట్లకు గాను 62 సీట్లను గెలుచుకొన్నామని గుర్తు చేశారు. తాజా ఉప ఎన్నికల్లో 5 సీట్లకు గాను 4 సీట్లను కైవసం చేసుకొని తమ సత్తా చాటామని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
బీజేపీతో విసుగెత్తిపోయారు : సిసోడియా
తాజా ఉప ఎన్నికల ఫలితాలపై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు. 2022 లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని సిసోడియా వ్యాఖ్యానించారు. బీజేపీ వ్యవహార శైలితో ప్రజలు విసుగెత్తిపోయారని, ఈ ఫలితాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు తమపై నమ్మకం ఉంచారని ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థుల కోసం పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు అని ట్విట్టర్ వేదికగా సిసోడియా ప్రకటించారు.
ఓటమిపై సమీక్షించుకుంటాం : బీజేపీ చీఫ్
ఉప ఎన్నికల ఫలితాలపై తాము సమీక్షించుకుంటామని ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా తెలిపారు. ఫలితాలను సమీక్షించి, అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసుకొంటామన్నారు. అన్ని అవాంతరాలనూ అధిగమించి, వచ్చే మున్సిపల్ నాటికి అధికారాన్ని చేజిక్కించుకుంటామని ఆదేశ్ తెలిపారు.
బీజేపీని ఇరుకున పెడుతున్న ఆప్
ఆమ్ఆద్మీ పార్టీ బీజేపీని వరుసగా ఇబ్బందులకు గురి చేస్తోంది. పాలనాపరంగా బీజేపీ కేజ్రీవాల్ సర్కార్‌కు ముందరి కాళ్లకు బంధం వేస్తుంటే… కేజ్రీవాల్ మాత్రం ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ… బీజేపీకి ఏకుమేకై కూర్చున్నారు. తాజాగా గుజరాత్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆప్ బీజేపీకి షాకిచ్చింది. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, జామ్ నగర్, భావనగర్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే సూరత్‌లో ఆప్ దూసుకుపోయింది. జామ్ నగర్, భావనగర్ లోనూ ఆప్ దూసుకుపోయింది. సహజంగా ఈ ప్రాంతాలన్నీ బీజేపీకి పట్టున్నవే. వ్యాపారులతో పాటు మధ్య తరగతి ప్రజలు కూడా ఉంటారు. ఈ రెండు వర్గాలూ ఇప్పుడు ఆప్ వైపు చూస్తున్నాయా? అన్నది వేచి చూడాలి.













