ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు బెయిల్ మంజూరు
మధ్యం కుంభకోణం కేసులో అరెస్టయిన తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పాస్పోర్టు అప్పజెప్పాలని, రూ.2లక్షల పూచీకత్తు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఫిబ్రవరి 8న బుచ్చిబాబును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అదే రోజున సీబీఐ అధికారులు ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపర్చగా, కోర్టు మొదట మూడు రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. అనంతరం దాన్ని మరో 14 రోజులు పొడిగింది, ఆ గడువు ముగియడంతో ఫిబ్రవరి 25వ తేదీ మరోసారి న్యాయస్థానంలో హాజరుపర్చగా ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్గోపాల్ జ్యూడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ విచారణకు రాగా తీర్పును ప్రత్యేక జడ్జి మరుసటి రోజుకు వాయిదా వేశారు. ప్రత్యేక జడ్జి సెలవులో ఉండడంతో తీర్పు వాయిదా పడింది. తాజాగా బుచ్చిబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.













