Delhi Liquor Scam: మళ్లీ మొదటికొచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు
ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam)కేసులో గత కొద్దిరోజులుగా అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఫిబ్రవరి 27, 2026న రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన సంచలన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ (CBI) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మంది నిందితులకు ఢిల్లీ హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో అవకతవకలు జరిగాయని, దాదాపు రూ.100 కోట్ల ముడుపులు చేతులు మారాయని సీబీఐ ఆరోపించింది. అయితే, ఫిబ్రవరి 27న రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేంద్ర సింగ్ 598 పేజీల సుదీర్ఘ తీర్పునిస్తూ, నిందితులందరినీ ఈ కేసు నుండి విముక్తి చేశారు. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులకు వ్యతిరేకంగా ఎటువంటి బలమైన ఆధారాలు లేవని చెప్పింది. సీబీఐ దర్యాప్తు “ముందుగా నిర్ణయించినట్లుగా, ఒక పద్ధతి ప్రకారం సృష్టించినట్లుగా ఉందని అభిప్రాయపడింది. కేవలం ఊహల ఆధారంగా వ్యక్తులను నిందితులుగా చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును తప్పుగా నడిపించిన దర్యాప్తు అధికారులపై శాఖాపరమైన చర్యలకు కూడా ఆదేశించింది.
ట్రయల్ కోర్టు తీర్పు తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంటూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ అంశంపై వాదనలు వినిపించారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణాలలో ఒకటి అని, ట్రయల్ కోర్టు ఆధారాలను సరిగ్గా పరిశీలించలేదని వాదించారు.
ఇవి కూడా చదవండి
దర్యాప్తు అధికారులపై కోర్టు చేసిన వ్యాఖ్యలు వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. దీంతో.. హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్, కవిత, సిసోడియాలకు నోటీసులు జారీ చేస్తూ వారి వివరణ కోరింది. దర్యాప్తు అధికారులపై చర్యలు తీసుకోవాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేస్తూ, ఈలోగా జవాబు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ పరిణామం అటు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి, ఇటు కవితకు కీలకంగా మారింది. ట్రయల్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు కేజ్రీవాల్ దీనిని సత్యమేవ జయతేగా అభివర్ణించారు. బిజెపి కక్షపూరిత రాజకీయాలకు ఇది నిదర్శనమని విమర్శించారు. అయితే, ఇప్పుడు హైకోర్టులో కేసు మళ్లీ విచారణకు రావడం వల్ల న్యాయపరమైన పోరాటం కొనసాగనుంది. సౌత్ గ్రూప్ తరఫున ముడుపులు చెల్లించారన్న ఆరోపణలతో ఐదు నెలలకు పైగా జైలులో ఉన్న కవితకు ట్రయల్ కోర్టు తీర్పు పెద్ద ఊరటనిచ్చింది. ఈ కేసు కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ నష్టపోయిందని ఆమె వాదన. ఇప్పుడు హైకోర్టు నోటీసులతో ఆమె మళ్లీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఢిల్లీ మద్యం కేసు కేవలం ఒక న్యాయపరమైన అంశం మాత్రమే కాదు, ఇది భారత రాజకీయాల్లో ఒక పెద్ద ప్రకంపన. ఒకవైపు దర్యాప్తు సంస్థల విశ్వసనీయతపై ట్రయల్ కోర్టు ప్రశ్నలు లేవనెత్తగా, మరోవైపు సీబీఐ తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని వాదిస్తోంది. ఢిల్లీ హైకోర్టు తీర్పు ఈ కేసులో అంతిమ మలుపు కానుంది. ఈ పోరాటం సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పటి వరకు కేజ్రీవాల్, కవితలకు న్యాయపరమైన సంకెళ్లు పూర్తిగా వీడనట్లే భావించాలి.
ఇవి కూడా చదవండి








