కేజ్రీవాల్ కు పెద్ద ఊరట

మద్యం విధాన కుంభకోణంలో నగదు అక్రమ చలామణి అభియోగాలను ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పెద్ద ఊరట లభించింది. ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష వ్యక్తిగత బాండు సమర్పించిన తర్వాత ఆయన్ని విడుదల చేయవచ్చని న్యాయమూర్తి న్యాయ్ బిందు ఆదేశించారు. తీర్పుపై పై కోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటలపాటు పక్కన పెట్టాలని ఈడీ చేసిన వినతిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. విచారణకు ఆటంకం కలిగించరాదని, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని కేజ్రీవాలాపై ఆంక్షలు విధించారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టుకు హాజరై విచారణకు సహకరించాలని ఆదేశించారు. ఉదయం వాదోపవాదాల తర్వాత తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి, సాయంత్రం దానిని వెలువరించారు.