కవితను విచారించనున్న సీబీఐ.. కోర్టు గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు సీబీఐకి లైన్ క్లియర్ అయింది. కవితను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ కొద్ది రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేయగా.. శుక్రవారం దీనిపై స్పెషల్ కోర్టు విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సిబీఐ విచారణకు అనుమతినిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మహిళా కానిస్టేబుల్ సమక్షంలో ప్రశ్నించాలని సీబీఐ అధికారులకు సూచించిన న్యాయస్థానం.. ఆమెను ప్రశ్నించే సమయంలో అన్ని నిబంధనలూ పాటించాలని, ప్రశ్నించేందుకు ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐకి సూచించింది. జైలు లోనికి ల్యాప్ టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సీబీఐ, ఈడీ అధికారులు ఆమెను పలు దఫాలుగా విచారించిన విషయం తెలిసిందే. అనంతరం మార్చి 15న ఇదే కేసులో అరెస్టైన కవిత 20 రోజులుగా జైల్లోనే ఉన్నారు. ఇక ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఆమెను వారం రోజుల్లో సీబీఐ అధికారులు ప్రశ్నించే అవకాశాలున్నాయి. గతంలో నమోదు చేసిన వాంగ్మూలం, అప్రూవర్‌గా మారినవాళ్లు, ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. కవితను ప్రశ్నించడం ద్వారా లభించబోయే సమాచారంతో మరో ఛార్జిషీటు దాఖలు చేసే ఆలోచనలో సీబీఐ ఉన్నట్ల సమాచారం.
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముడుపులు చేతులు మారాయని, కొత్త మద్యం విధానాన్ని రూపొందించడం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు లబ్దిచేకూరేలా వ్యవహరించారంటూ ఆరోపిస్తూ కేంద్ర హోంశాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగానే.. ఈడీ కూడా రంగంలోకి దిగి మనీలాండరింగ్ చేశారంటూ కవితపై కేసు నమోదు చేసి పలుమార్లు విచారించింది. చివరిగా మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే దాదాపు 3 గంటలపాటు కవితను విచారించిన ఈడీ.. చివరిగా అరెస్ట్ చేసి 10 రోజులు కస్టడీకీ తీసుకుంది. అనంతరం కోర్టు ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి తరలించగా ప్రస్తుతం తిహార్ జైలులో కవిత ఉన్నారు. ఈ క్రమంలో దర్యాప్తులో భాగంగా మరోసారి కవితను ప్రశ్నించేందుకు సీబీఐ ప్రత్యేక పిటిషన్ వేయడం, అందుకు కోర్టు అనుమతించడం చర్చనీయాంశంగా మారింది.













