మోదీ గారూ…. ఇలా చేయండి : కేజ్రీవాల్ సూచనలు
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే మరణాల రేటు మాత్రం తగ్గడం లేదు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అందులో నాలుగు అతి ముఖ్యమైన సూచనలు చేశారు. దేశ వ్యాప్తంగా కరోనా అందుబాటులోకి రావాలంటే వ్యాక్సినైజేషన్ ఒక్కటే మార్గమని, దానిని వేగిరం చేయాలని సూచించారు. ఢిల్లీలో యువకులకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని నిలిపేస్తున్నామని, కేంద్రం పంపిన టీకాలు పూర్తయ్యాయని తెలిపారు. మరిన్ని డోసులు పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల తమకు 80 లక్షల డోసులు అవసరముంటే, ఈ నెలలో కేవలం 16 లక్షల డోసులు మాత్రమే వచ్చాయని కేజ్రీవాల్ తెలిపారు.
కేజ్రీవాల్ చేసిన సూచనలు
1. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా ఉత్పత్తిని తప్పనిసరి చేయాలి. దేశంలో ఉన్న వ్యాక్సిన్ తయారీ సంస్థలన్నింటికీ ఈ ఆదేశాలు జారీ చేయాలి. 24 గంటల్లోగా వారితో సమావేశం ఏర్పాటు చేయాలి. టీకాల సంఖ్యను విపరీతంగా పెంచాలి.
2. కొన్ని దేశాలు వారి జనాభాకు సరిపడే కంటే ఎక్కువగా వ్యాక్సిన్లను నిల్వ చేసుకుంటున్నాయి. ఆ దేశాలతో మాట్లాడి మన దేశానికి వ్యాక్సిన్లు వచ్చేలా చేయాలి. అందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలి.
3. విదేశీ టీకా తయారీ సంస్థలకు భారత్లో టీకాలు ఉత్పత్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలి.
4. టీకాను తయారు చేసే విదేశీ సంస్థల నుంచి కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి, రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. రాష్ట్రాలు కొనుగోలు చేస్తే, ఇతర రాష్ట్రాలతో పేచీ ఏర్పడుతోంది. దీనిని నివారించడానికి కేంద్రమే వ్యాక్సిన్ను కొనుగోలు చేసి, పంపిణీ చేస్తే బాగుంటుంది.













