కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ సమన్లు
ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఏడోసారి నోటీసులు అందించింది. ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఇప్పటివరకు కేజ్రీవాల్ ఆరుసార్లు నోటీసులు జారీ చేయగా, ఒక్కసారి కూడా ఆయన హాజరు కాలేదు. ఇటీవల ఆరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యహారం కోర్టులో ఉన్న తరుణంలో విచాణరకు నోటీసులు పంపించడం చట్టవిరుద్ధమని ఆప్ ఆరోపించింది. మనీలాండరింగ్ కేసులో విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరుపై దర్యాప్తు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల సమన్లు జారీ చేయడంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థాన విచారణకు హాజరయ్యారు. విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. తదుపరి విచారణకు హాజరవుతానని అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. తాజాగా కేజ్రీవాల్‌కు ఈడీ ఏడోసారి సమన్లు జారీ చేసింది.













