రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో అది స్పష్టం
సైనిక ఆయుధాలు, ఉపకరణాల ఉత్పత్తి విషయంలో స్వావలంబన సాధించడం అత్యంత కీలకమని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో అది స్పష్టమైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. నౌక దళ కమాండర్ల సదస్సులో రాజ్‌నాథ్ ప్రసంగించారు. జాతీయ భద్రత సవాళ్లను ఎదుర్కోవడంలో త్రివిధ దళాలు సమస్వయంతో పనిచేయాలని, భవిష్యత్తు యుద్ధాల్లో ఉమ్మడి కార్యకలాపాలు కీలకం కానున్నాయని తెలిపారు. మిలిటరీ కమాండ్ల పునర్వ్యవస్థీకరణ, త్రివిధ దళాల ఉమ్మడి కమాండ్ల ఏర్పాటు దిశగా చర్యలు వేగిరం చేసినట్లు తెలిపారు. రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులను పెంచే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. తొలి స్వదేశీ నిర్మిత యుద్ధ వాహక నౌక విక్రాంత్‌ను ఈ ఏడాదికల్లా అధికారికంగా అందుబాటులోకి తెచ్చే దిశగా కృషి చేయాలని, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో అదో మధుర ఘట్టంగా నిలుస్తుందని పేర్కొన్నారు.













