బోర్లా పడుకుంటే నాడీ వ్యవస్థకు నష్టం
కొవిడ్-19తో తీవ్రస్థాయిలో అనారోగ్యం పాలైన వారిని బోర్లా పడుకోబెట్టి, వెంటిలేటర్ అమరుస్తుంటారు. దీనివల్ల వారి శ్వాస పక్రియ కొంత మెరుగుపడినప్పటికీ నాడీ వ్వవస్థకు శాశ్వత నష్టం కలిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రక్త ప్రవాహం తగ్గడం, ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందని చెప్పారు. వెంటిలేటర్లపై ఉన్న ఇతర రోగులు ఇలాంటి స్థితిలో పడుకున్నప్పటికీ వారిలో నాడులు దెబ్బతినడం చాలా అరుదని తెలిపారు. ఈ తరహా ఇబ్బందిని చాలాకాలం పాటు పరిశోధకులు గుర్తించలేదు. తీవ్రస్థాయిలో అనారోగ్యంపాలైన వారు కోలుకున్నాక సాధారణంగానే కొంత మేర బలహీనంగా ఉంటార్న అంచనాలే ఇందుకు కారణం.
అయితే కొవిడ్ 19 బాధితుల్లో మణికట్టు, మడమ, భుజం వంటి కీలక భాగాల్లో కీళ్ల వద్ద సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ భాగాలన్నీ ఒకవైపు పూర్తిగా పక్షవాతం సోకినట్లుగా మోరాయిస్తున్నాయి. తీవ్రస్థాయిలో అనారోగ్యంపాలైన కొవిడ్ 19 బాధితుల్లో 12-15 శాతం మందికి శాశ్వతంగా నాడులు దెబ్బతింటున్నాయని గుర్తించారు. అనారోగ్యంపాలైన వారు సాధారణంగా తమ శ్వాసకు అనుకూలించే స్థితిలో పడుకోవడం వల్ల తలెత్తే ఒతిళ్లను తట్టుకోగలుగుతారు.అయితే కొవిడ్-19 భాదితుల్లోని నాడులు వీటిని భరించలేవు. వీరి మోచేయి, మెడ భాగంలో తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్నట్లు గుర్తించారు. అందువల్ల వారి పడక విషయంలో సర్దుబాటు చేయాల్సి వచ్చింది అని పరిశోధనలో పాలుపంచుకున్న కాలిన్ ఫ్రాంజ్ తెలిపారు. వీరికి న్యూరల్ స్టిమ్యులేషన్ చికిత్స చేస్తే నాడులు తిరిగి వృద్ధి చెందే అవకాశం ఉండొచ్చన్నారు. అయితే మధుమేహం వంటి ఇబ్బందులు ఉన్నవారిలో ఈ నాడుల వృద్ధి అంత సులువు కాకపోవచ్చని పేర్కొన్నారు. అలాంటి వారు పూర్తిస్థాయిలో కోలుకోవడం కష్టం కావచ్చన్నారు. వారు నడిచేటప్పుడు, చేతితో కంప్యూటర్ లేదా సెల్ఫోన్ వంటివి వాడే సమయాల్లో ఇబ్బంది పడొచ్చని, ఈ సమస్యలు శాశ్వతంగా ఉండొచ్చని చెప్పారు.













