కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం… తక్షణమే మాఫీ
రెండో దశలో కరోనా ఉధృతి తీవ్రమవుతోన్న వేళ వైద్యపరంగా ప్రజలపై పడుతోన్న భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్, కొవిడ్ టీకాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ, ఆరోగ్య సెస్‌ను తక్షణమే మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. మూడు నెలల కాలానికి ఇది అమల్లో ఉండనున్నట్లు తెలిపింది. దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితులపై ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. తాజా నిర్ణయం వస్తువులపై లభ్యతను పెంచడమే కాక చౌకగా లభించేలా చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అలాగే వాటికి త్వరగా కస్టమ్స్ అనుమతులు వచ్చేలా చూడాలని ప్రధాని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించింది. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ప్రధాన మంత్రి వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నట్లు తెలిపింది.













