అన్‌లాక్ -2 అమలు ఎలా?
దేశంలో మరోమారు లాక్డౌన్ ఉండబోదని ప్రధాని మోదీ సృష్టం చేశారు. అన్‌లాక్ -2 ఎలా అమలు చేయాలన్నదానిపై చర్చించాలని ముఖ్యమంత్రులకు సూచించారు. కరోనా నివారణ చర్యలపై సమీక్షలో భాగంగా 14 రాష్ట్రాల సీఎంలు, జమ్మూకశ్మీర్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మళ్లీ లాక్డౌన్ విధిస్తారన్న వదంతులను తోసిపుచ్చారు. లాక్డౌన్ నిబంధనల్లో సడలింపుల వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయన్నారు. ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోనే ఉందని తెలిపారు. కరోనా వైరస్ నివారణలో సమాచారం అత్యంత కీలక అంశమని, కొవిడ్ హెల్ప్ లైన్ నంబర్లు, హెల్ప్ లెస్ నంబర్లుగా మారకూడదని ప్రధాని చెప్పారు. సీనియర్ డాక్టర్లు యువ వలంటీర్లతో బృందాలను ఏర్పాటు చేసి టెలిమెడిసన్ ద్వారా రోగులకు సూచనలు ఇవ్వాలన్నారు. ప్రజల్లో కొవిడ్‌పై అవగాహన పెంచి వారిలో భయాందోళనలను దూరం చేయాలని సూచించారు. భౌతికదూరం ఉల్లంఘన, పట్టణాల్లో కిక్కిరిసిన ఇండ్లు నివవారణలో మరిన్ని సవాళ్లు విసురుతున్నాయని చెప్పారు. రికవరీ రేటు పెరగడం ఊరట నిస్తున్నదని అన్నారు. అన్ని రాష్ట్రాలు తమ కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వైద్య సదుపాయాలు, మరింత పెంచాలన్నారు. కొన్ని చోట్లు కేసులు బాగా పెరుగుతున్నప్పటికి ప్రజల సంయమనం, అధికారుల ముందుచూపు వల్ల కరోనా నియంత్రణలోనే ఉన్నదని తెలిపారు.













