కాంగ్రెస్ నూతన అధ్యక్షుని ఎన్నికకు.. ముహుర్తం ఖరారు

కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుని ఎన్నికకు ముహుర్తం ఖరారైంది. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికను జూన్ 23న నిర్వహించాలని ఆ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడు ఉండాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. 2019లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఓటమి పాలవ్వడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు. తాత్కాలిక పదవి కాకుండా శాశ్వతంగా అధ్యక్షుడిని ఎంపిక చేయాలని పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. దీంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్దమైంది ఏఐసీసీ. నూతన అధ్యక్షుడు ఎవరు అనేది జూన్‍లో తేలనుంది. జూన్ 23న ఎన్నిక జరగనుందని, జూన్ 7న నామినేషన్లు ముగుస్తాయని తెలుస్తోంది. అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.