కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరైనా.. ప్రధాని అభ్యర్థి మాత్రం రాహుల్ గాంధీనే?
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధి ఎవరనే విషయంపై స్పందించారు. ముందు పార్టీ అధ్యక్ష ఎన్నికలు పూర్తయితే ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. భోపాల్‌లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయన్ను.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధిగా రాహుల్ నిలబడతారా? లేక ఖర్గేనే పోటీ చేస్తారా? అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి బదులిచ్చి ఖర్గే దీనిపై కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తర్వాతే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న మరో నేత శశిథరూర్ కూడా దేశవ్యాప్తంగా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాలని 2020లో సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో శశి థరూర్ ఒకరనే సంగతి తెలిసిందే. ఈ కారణంగా సోనియా కుటుంబం శశిథరూర్‌కు మద్దతు ఇవ్వకపోవచ్చు అని విశ్లేషకుల అభిప్రాయం. అదే నిజమైతే అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే విజయం లాంఛనమే అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా నిర్ణయాలు తీసుకునే అధికారం మాత్రం సోనియా కుటుంబానిదే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధిగా రాహుల్ గాంధీనే ఉంటారని కూడా బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఖర్గే సహా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ ఉమ్మడిగా ఇదే నిర్ణయంపై నిలబడ్డారని సమాచారం. దీంతో పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా పార్టీ తరపున రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్ధిగా ప్రతిపాదిస్తారని బలమైన వాదన వినిపిస్తోంది.













