కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శశిథరూర్ నామినేషన్ వేసేది అప్పుడేనా?
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి వచ్చే నెల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేత శశిథరూర్ పోటీ పడటం దాదాపు ఖాయమైంది. ఇప్పిటికే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించేశారు కూడా. ఆ తర్వాత శశిథరూర్ కూడా తనకు ఐదు సెట్ల నామినేషన్ పత్రాలు కావాలంటూ పార్టీకి లేఖ రాశారు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఈ నెల 30వ తేదీన.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు శశిథరూర్ నామినేషన్ వేయనున్నారట. ఈ ఎన్నికల్లో ఎవరైనా నిలబడాలంటే ఆ అభ్యర్థి పేరును దేశంలోని కనీసం 50 మంది పార్టీ డెలిగేట్స్ ప్రతిపాదించాల్సి ఉంది. ఈ క్రమంలోనే శశిథరూర్ ఐదు సెట్ల నామినేషన్ పేపర్స్ సిద్ధం చేసుకుని వివిధ రాష్ట్రాల్లోని పార్టీ ప్రతినిధులను కలుస్తున్నారట. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా మళ్లీ పగ్గాలు అందుకున్నారు. మరోసారి అధ్యక్షుడిగా నిలబడాలని రాహుల్‌ను ఎందరు కోరినా ఆయన నిరాకరించారు. దీంతో ప్రియాంక చోప్రా పార్టీ పగ్గాలు చేపడతారని వార్తలు వచ్చాయి. అయితే తమ కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడటం లేదని రాహుల్ తేల్చిచెప్పడంతో గాంధీయేతర వ్యక్తి ఈ పీఠం అధిష్టించనున్నారు.













