పార్టీలో పెద్ద నాయకులు నాకు మద్దతు ఇవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు: శశిథరూర్
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం కోసం కేరళ ఎంపీ శశిథరూర్ కష్టపడుతున్నారు. అదే సమయంలో గాంధీ కుటుంబం అండతో బరిలో దిగిన మల్లికార్జున ఖర్గేకు తమ మద్దతు ఉంటుందని పలువురు నేతలు ప్రకటించారు. వీరిలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె. సుధాకరన్ కూడా ఉన్నారు. స్వరాష్ట్రంలోనే మద్దతు లేకపోవడంపై ప్రశ్నించగా.. థరూర్ స్పందించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన పెద్ద నాయకులు తనకు మద్దతు ఇస్తారని తను అనుకోడంలేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు కోసం థరూర్ ప్రచారం సాగిస్తున్న సమయంలో కేపీసీసీ అధ్యక్షుడు కె.సుధాకరన్ తన మద్దతు ఖర్గేకే అని బహిరంగంగా ప్రకటించడంతో థరూర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘పార్టీ పెద్ద నాయకులు నాకు మద్దతు ఇవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పడూ అంతే. నాగ్పూర్, వార్దా, హైదరాబాద్లో పార్టీ కార్యకర్తలను కలుసుకున్నా. వాళ్లంతా ఒకప్పుడు నన్ను పోటీ చేయమన్నారు. వెనకడుగు వేయవద్దని చెప్పారు. నేను కూడా వెనక్కి తగ్గేది లేదని హామీ ఇచ్చా. నాకు మద్దతుగా నిలిచిన వారి నమ్మకాన్ని నేను ఇంతవరకూ వమ్ము చేయలేదు. నామీద వారికున్న ఆ నమ్మకమే నా బలం’ అని శశిథరూర్ తేల్చిచెప్పారు.













