ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కాంగ్రెస్.. తమిళనాడులో దాచేందుకు ఏర్పాట్లు?
కర్ణాటకలో భారీ విజయం దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. మ్యాజిక్ ఫిగర్ 113 కాగా ఆ పార్టీ ఇప్పటికే 118 స్థానాల్లో విజయం సాధించింది. ఇంకో 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో గెలిచిన తమ అభ్యర్థులను రక్షించుకోవడానికి కాంగ్రెస్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మెజార్టీ ఏమాత్రం అటూ ఇటు అయినా.. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ముందే ప్లాన్ వేసుకుందట. గత అనుభవాల నేపథ్యంలో గెలిచిన ఎమ్మెల్యేలను తమిళనాడుకు షిఫ్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు రెడీ చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ గేమ్ ప్లాన్ నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ఈ ఆలోచన చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉండటం, ఆ పార్టీతో కాంగ్రెస్కు మంచి సంబంధాలు ఉండటంతో గెలిచిన వారిని అక్కడికి పంపాలని హస్తం పార్టీ అనుకుందట. దీని కోసమే డీంఎకే నేతలతో కర్ణాటక కాంగ్రెస్ నేతలు టచ్లో ఉన్నట్లు కొన్ని కథనాలు బయటకు వచ్చాయి. ఫలితాలు పూర్తిగా వచ్చిన వెంటనే గెలిచిన ఎమ్మెల్యేలను బెంగళూరుకు రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు కొందరు చెప్తున్నారు.













