సోనియా, రాహుల్‌కు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పిన తమిళనాడు సీఎం స్టాలిన్
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిచింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 113 సీట్లు అవసరం కాగా.. ఆ పార్టీ ఇప్పటికే 122 సీట్లలో విజయం సాధించింది. మరో 18 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార బీజేపీ కేవలం 56 స్థానాల్లో నెగ్గి, మరో 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేడీ (ఎస్) 19 స్థానాల్లో గెలిచి, ఒకే ఒక స్థానంలో ముందంజలో ఉంది. ఇతరులు 4 స్థానాలు గెలుచుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. గత కొన్నాళ్లుగా మోదీ మేనియా ముందు కాంగ్రెస్ వెలవెలబోతున్న సంగతి తెలిసిందే. దేశంలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేక ఫలితాలే వచ్చాయి. ఇలాంటి సమయంలో కర్ణాటక ఎన్నికలను కాంగ్రెస్ చాలా సీరియస్‌గా తీసుకుంది.
ఈ ఎన్నికల్లో కూడా ఓడితే దేశంలో కాంగ్రెస్ ఉనికికే ప్రమాదం అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీని ఓడించిన ఆనందం కాంగ్రెస్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలను తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందనలు తెలియజేశారు. ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలకు ఫోన్ చేసి మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల సరళి పట్ల సోనియా, రాహుల్‌లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యలకు కూడా ఫోన్ చేసిన స్టాలిన్ వారికి కూడా అభినందనలు తెలిపారు.













