దయచేసి అలా చేయకండి.. కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. సరదా కోసం వరద ప్రవాహంలో ఈత కొట్టడం, సెల్ఫీల కోసం ప్రయత్నించవద్దని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను కోరారు. ముకుంద్పుర్ ప్రాంతంలో ముగ్గురు పిల్లలు వరద నీటితో ఈత కొట్టేందుకు ప్రయత్నించి మరణించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ ప్రజలను ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. చాలా చోట్ల వరద ప్రవాహంలో కొందరు ఈత కొడుతున్నట్లు, సెల్ఫీలు, వీడియోల కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధమైన చర్యలు ప్రాణాలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. వరద తగ్గుముఖం పట్టినా ఆయా ప్రాంతాల్లో మాత్రం పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఏ క్షణంలోనైనా నీటి ప్రవాహం పెరగవచ్చు. కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నాను అని అన్నారు.













