రాష్ట్రపతి ఎన్నికలు.. ఓటు వేసిన సీఎంలు
తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్ జరిగింది. హైదరాబాద్, అమరావతిలోని అసెంబ్లీ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓటు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి ఓటు వేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఓటు వేసేందుకు క్యూలైన్లలో నిలబడ్డారు. వైసీపీ తరపున మంత్రి బుగ్గన, శాసనసభా వ్యవహారాల సమన్వయకర్త, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఏజెంట్లుగా వ్యవహరించారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు పోలింగ్లో పాల్గొనేలా ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తమ ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ కార్యాలయం నుంచి అసెంబ్లీకి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీ, టీడీపీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్లో ఓటు చేశారు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరిగింది. మంత్రి కేటీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి తరలి వచ్చారు. తొలి ఓటు హక్కును మంత్రి కేటీఆర్ వినియోగించుకున్నారు. తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేశారు. మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతితో ఆంధ్రప్రదేశ్లోని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి తెలంగాణ శాసనసభలో ఓటు వేశారు.













