బాబ్రీ కేసు కొట్టేయండి…
ప్రముఖ బిజెపి నాయకులు అద్వానీ, మురళి మనోహర్ జోషిపై నమోదైన బాబ్రీ మసీదు కేసును కొట్టేయాల్సిందిగా బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ చేసే సమయంలోపు ఈ కేసును కొట్టేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అద్వానీ, జోషి, ఇతర బీజేపీ నాయకులు బాబ్రీ మసీదును కూల్చారని కొంతమంది ఆరోపిస్తున్నారని, కానీ ఈ ఘటనతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆలయ పునర్నిర్మానానికే పనిచేసినట్లు వెల్లడించారు. మరోవైపు అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను మూసివేస్తే మంచిదని ‘రామ జన్మభూమి’ కేసులో ప్రధాన పిటిషనర్ అయిన ఇక్బాల్ అన్సారీ లక్నో సీబీఐ కోర్టుని కోరారు.
అయోధ్య భూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే తుది తీర్పును వెలువరించిందని, ఈ సమయంలో మళ్లీ బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ చేపట్టడం అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సున్నితమైన అంశం కాబట్టి సీబీఐ తీర్పు దేశంలో మరోసారి రాజకీయ వైరుధ్యాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.













