హైకోర్టు జడ్జిల సదస్సును ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు ఆవరణలో జరిగిన హైకోర్టు జడ్జిల సదస్సును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో న్యాయవ్యవస్థ నిబద్దతతో విధులు నిర్వహించిందని అన్నారు. సాధ్యమైనంతమేర న్యాయం అందించేందుకు కృషి చేశామని తెలిపారు. సంస్థ పట్ల మద్దతు, నిబద్దతతో అద్భుత విజయం సాధించవచ్చని అన్నారు. కొన్ని హైకోర్టుల స్పందన ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని తెలిసి సంతోషిస్తున్నానని చెప్పారు. సమష్టి కృషితో హైకోర్టులో 126 ఖాళీలను ఏడాదిలోపు భర్తీ చేయగలిగామని వెల్లడిరచారు. మరో 50 నియామకాలు త్వరలో జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికీ ఖాళీలున్న హైకోర్టు సీజే పేర్లను పదోన్నతి కోసం పంపాలని కోరారు. ఏడాది కాలంలో సుప్రీంకోర్టులో తొమ్మిది మంది కొత్త జడ్జిలు, హైకోర్టులకు 10 మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులు వచ్చారని చెప్పారు. తనకు సహకరించిన కొలీజియం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఆరేళ్ల తర్వాత ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.













