పద్మశ్రీ గ్రహీతలకు జస్టిస్ ఎన్వీ రమణ.. ఆత్మీయ సన్మానం
తెలుగు రాష్ట్రాలకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సన్మానించారు. న్యూఢిల్లీ లోని ఆయన నివాసంలో మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు, డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు, నాదస్వర విద్వాంసుడు గోసవీడు షేఖ్ హసన్ సాహిబ్ (మనవడు)లను ఎన్వీ రమణ పుష్పగుచ్చాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మీడియాతో మాట్లాడుతూ ఇది తెలుగు ప్రజలందరూ సంతోషించాల్సిన విషయమని అన్నారు. మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు తెలియని వారు లేరని అన్నారు. సుంకర వెంకట ఆదినారాయణ రావు పొలియో ఆపరేషన్ చేసి ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదించారని కొనియాడారు. కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య తన కళను ఇతరులకు నేర్పించాలని కోరారు. నాదస్వర వాయిద్యకారుడు గోసవీడు షేక్ హసన్ సాహెబ్ తన పాటలతో అలరించేవారని గుర్తు చేశారు.













