ఇది ప్రజాస్వామ్యానికి అంతా ఆరోగ్యకరం కాదు : జస్టిస్ ఎన్.వి. రమణ
మన కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నప్పుడు మనకున్న లక్ష్మణ రేఖను కూడా గుర్తుంచుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల సీజేలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సును ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ మాట్లాడుతూ కొన్ని ప్రభుత్వాలు కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయని, ఇది ప్రజాస్యామ్యానికి అంత ఆరోగ్యకరం కాదని తెలిపారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరం. న్యాయవ్యవస్థలో మౌలిక వసతులను త్వరతగతిన ఏర్పాటు చేయాలి. కేసులు పరిష్కారానికి మరింత సిబ్బంది కావాలి. కోర్టులో మానవ వనరుల కొరత తీరితే కేసుల భారం తగ్గుతుంది. న్యాయవ్యవస్థలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. ఏడాది కాలంగా జడ్జీల నియామకాల్లో ప్రభుత్వం పూర్తిగా సహకరించింది అని తెలిపారు.
న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ పరస్పర సహకారంతో ముందుకు సాగితేనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని అన్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని అందరూ గౌరవించాల్సిందే. వార్డు సభ్యుడి నుంచి లోక్సభ సభ్యుడి వరకు అందరిని గౌరవించాలి. అయితే కోర్టుల ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయి. న్యాయపరమైన తీర్పులు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వక చర్యలు ప్రజాస్వామ్యానికి అంత ఆరోగ్యకరం కావు అని అన్నారు.













