ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాపై…జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ టీవీ ఛానెళ్లలో చర్చలు, సామాజిక మాధ్యమాల్లో కంగారు కోర్టుల నిర్వహణ దేశ ప్రజాస్వామ్యానికి హానికరమని వ్యాఖ్యానించారు. మీడియా చర్చలు న్యాయవ్యవస్థ పనితీరు, స్వతంత్రతను ప్రభావితం చేస్తాయన్నారు. మీడియా వ్యక్తం చేస్తున్న పక్షపాత అభిప్రాయాలు, ప్రత్యేక ఎజెండాతో నడిచే చర్చలు భారత ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కి వేసేలా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రింట్ మీడియా ఇంకా కాస్త జవాబుదారీగా వ్యవహరిస్తోందని, కానీ ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం జీరో జవాబుదారీతనంతో ఉందని అన్నారు.
ఇటీవల కాలంలో న్యాయమూర్తులపై భౌతికదాడులు పెరుగుతున్నాయని, ఎటువంటి రక్షణ లేకుండానే జడ్జిలు సమాజంలో జీవించాల్సి వస్తోందన్నారు. రాజకీయవేత్తలు, అధికారులు, పోలీసు ఆఫీసర్లు, ప్రజా ప్రతినిధులకు రిటైర్మెంట్ తర్వాత కూడా సెక్యూర్టీ కల్పిస్తున్నారని, కానీ జడ్జిలకు ఇదే తరహా రక్షణ లేకుండా పోయిందన్నారు. సోషల్ మీడియా పరిస్థితి మరీ దారుణంగా ఉందని అన్నారు. స్వీయ నియంత్రణతో మీడియా ఉండాలని ఆయన కోరారు. పదాలను మీడియా జాగ్రత్తగా వాడాలన్నారు. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలు బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ప్రజలను విద్యావంతులను చేసేందుకు, చైతన్య పరిచేందుకు ఎలక్ట్రానిక్ మీడియా తన గళాన్ని వాడుకోవాలని సూచించారు.













