సీబీఐ డైరెక్టర్‍గా సుబోధ్ జైస్వాల్

సీనియర్ ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‍గా నియమితులయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 1985వ బ్యాచ్‍కు చెందిన జైస్వాల్ ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‍ఎఫ్) డైరెక్టర్ జనరల్‍గా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీజేఐ ఎన్వీ రమణ, లోక్‍సభలో ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరిలతో కూడిన హైపవర్ కమిటీ ప్రధాని నివాసంలో సమావేశమై ముగ్గురి పేర్లను షార్ట్లిస్ట్ చేసింది.
ఈ జాబితాలో సీఐఎస్‍ఎఫ్ చీఫ్ సుబోధ్ జైస్వాల్, ఎస్‍ఎస్‍బీ డీజీ కేఆర్ చంద్ర, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి వీఎస్‍కే కౌముది పేర్లు ఉన్నట్లు తెలిసింది. వీరిలో సీనియర్ అయిన జైస్వాల్‍ను సీబీఐ డైరెక్టరుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. జైస్వాల్ మహారాష్ట్ర డీజీపీగా పనిచేశారు. ముంబై కమిషనర్ గానూ, రా లో తొమ్మిదేళ్లు పనిచేశారు. సీబీఐ డైరెక్టర్‍గా ఉన్న రిషి కుమార్ శుక్లా ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన పదవీవిరమణ చేశారు. అప్పటినుంచి అదనపు డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా తాత్కాలిక డైరెక్టర్‍గా విధులు నిర్వర్తిస్తున్నారు.