నిత్యం బుకాయించే చైనా… సత్యం పలికింది…
ప్రపంచాన్ని శాసించే ప్రక్రియలో చైనా ప్రతి విషయంలోనూ అబద్ధాలాడుతుంది. లేదంటే భయపెట్టిస్తుంది. అంతేగానీ జరిగిన వాస్తవాన్ని, విషయాల్ని ఏమాత్రం యథాతథంగా ఒప్పేసుకునే సంస్కారం ఏమాత్రం లేదు. గాల్వాన్ సరిహద్దు విషయంలోనూ ఇదే జరిగింది. భారత, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో చైనా సైనికులెవ్వరూ మరణించలేదని చైనా ఇన్ని రోజులూ బీరాలు పలుకుతోంది. అంతర్జాతీయ వేదికల మీద బుకాయిస్తూ వస్తోంది. కానీ.. హఠాత్తుగా స్వరం మార్చుకుంది. గాల్వాన్ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో చైనాకు చెందిన ఐదుగురు సైనికులు మరణించారని చైనా అధికారికంగా ఒప్పేసుకుంది. మరణించిన వారికి చైనా సర్కార్ గౌరవ హోదాలను కల్పించింది. క్విఫాబావో, చెన్ హాంగిజున్, చెన్ జియాంగ్‌రాంగ్, జియావో సియువాన్, వాంగ్ జువారన్లున్నారు. వీరందర్నీ చైనా ప్రభుత్వం గౌరవించింది.
గాల్వాన్‌లో ఘర్షణ…
గల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలు తలెత్తాయి. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత దేశ సైనికులు వీరమరణం పొందారు. ఈ విషయాన్ని భారత్ అంగీకరించింది. చైనా మాత్రం మాయమాటలతో ఒక్కరూ మరణించలేదని బుకాయిస్తూ వస్తోంది. చైనా సైనికులు కూడా భారీ సంఖ్యలోనే మరణించారని భారత్ చెప్పినా, చైనా మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు.
ఏకంగా వీడియోను విడుదల చేసిన చైనా
భారత్, చైనా సైనికులు ఒకరిపై ఒకరు కాల్పులు చేసుకున్న దృశ్యాలు చైనా విడుదల చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఘర్షణలో గాయపడ్డ వారిని కూడా తీసుకెళ్లడం అందులో ఉంది. మరణించిన వారికి చైనా జవాన్లు సెల్యూట్ చేయడం కూడా ఇందులో ఉంది. అయితే చైనా ఈ వీడియోలో భారత్ పేరును ఎక్కడా ప్రస్తావించకుండానే వ్యాఖ్యలు చేసింది. ఏప్రిల్ నుంచి కొన్ని విదేశీ శక్తులు ఒప్పందాలను ఉల్లంఘిస్తూనే వస్తున్నాయని మండిపడింది. వివిధ అవసరాల రీత్యా సరిహద్దును దాటారని ఆరోపించింది. అయితే మార్పు తీసుకురావడంలో మాత్రం ఏక పక్షంగా వ్యహరిస్తున్నారని, ఈ ఏకపక్ష విధానంతోనే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయని పేర్కొంది. చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని శతధా ప్రయత్నించామని, కానీ చర్చలను అవతలి పక్షం అంత సీరియస్ గా తీసుకోలేదని పరోక్షంగా భారత్‌పై చైనా మండిపడింది. అంతేకాకుండా సరిహద్దు ప్రాంతాల్లోకి భారత్ భారీ సంఖ్యలో సైనికుల్ని మోహరించిందని, వెనక్కి వెళ్లండని చైనా చెప్పిన సందర్భంలోనే ఘర్షణలు తలెత్తాయని చైనా పేర్కొంది.
ఇప్పటి వరకూ 9 రౌండ్ల చర్చలు
సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనా మధ్య మిలటరీ స్థాయి అధికారి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ 9 రౌండ్ల చర్చలు జరిగాయి. తొమ్మిదో రౌండ్ చర్చలు ఉదయం 10 గంటలకు ప్రారంభమై, అర్ధరాత్రి 2 గంటల వరకూ సాగాయి. అంత సుదీర్ఘమైన రౌండు ఇదే. ఈ రౌండ్ తర్వాతే వాస్తవాధీన రేఖ వద్ద మోహరించిన తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నామని చైనా ప్రకటించింది. దీంతో యుద్ధ ట్యాంకులు, సామాగ్రి వెనక్కి తరలి వెళ్లింది. ఇక భారత్ కూడా తన బలగాలను ఉపసంహరించుకుంది.













