కేంద్ర మంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు … ప్రజల్లో మార్పు రాకపోతే
ట్రాఫిక్ నియమాలు పాటించేలా పౌరుల్లో మార్పు తీసుకురాకపోతే భారత్‌లో రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టాలను తగ్గించేందుకు చేపట్టే ప్రయత్నాలేవీ విజయవంతం కావని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో రోడ్డు ప్రమాదాలను తగ్గించే బాధ్యత కేంద్రంతో పాటు సామాన్యులపై సైతం ఉందని స్పష్టం చేశారు. ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై గౌరవం లేకపోవడంపై విచారణ వ్యక్తం చేశారు. అతివేగంగా, హెల్మెట్ వినియోగించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్లో వాహనాలు నడపడం భారత్‌లో చాలా రోడ్డు ప్రమాదాలకు కారణాలు. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఉల్లంఘిస్తున్నారు. చట్టంపై భయం, గౌరవం లేవని గడ్కరీ పేర్కొన్నారు. వాహనదారుల సహకారం లేకుండా ప్రమాదాల సంఖ్యను సమర్థవంతంగా తగ్గించడం కష్టమని పునరుద్ఘాటించారు.













