కేంద్రం కీలక నిర్ణయం… వారానికి 4 రోజులే
దేశంలో ఉద్యోగులు వారానికి నాలుగురోజులే డ్యూటీ చేసే రోజులు త్వరలో రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కార్మిక చట్టాల (లేబర్ కోడ్స్)తో ఈ అవకాశం ఏర్పడుతుందని కేంద్ర కార్మికశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర తెలిపారు. కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం సంస్థలు తమ ఉద్యోగులతో వారానికి 48 గంటలకు మించి పని చేయించుకోకూడదు. అయితే, రోజుకు 12 గంటల చొప్పున వారానికి నాలుగు రోజులు, 10 గంటల చొప్పున ఐదు రోజులు, 8 గంటల చొప్పున ఆరు రోజులు.. పని చేయించుకొనే అవకాశం ఉన్నదని తెలిపారు. వారంలో ఎన్నిరోజులు పని చేయించుకోవాలన్నది సంస్థ ఇష్టమని. ఉద్యోగి అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 1.వేతనాలు 2. పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత 3.ఆరోగ్యం, పని పరిస్థితులు 4. సామాజిక భద్రత పేరుతో కేంద్రం 4 లేబర్ కోడ్స్‌ను తెచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమలులోకి రానున్నాయి.













