కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన

ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని ప్రకటించిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. 25 కోట్ల కోవిషీల్డ్ డోసులకు, 19 కోట్ల కొవ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ ఇచ్చినట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని నీతి అయోగ్ సభ్యుడు డా. వీకే పాల్ ప్రకటించారు. సీరం ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలకు టీకాల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇప్పటికే కుదుర్చుకున్న టీకా కొనుగోలు ఒప్పందాలకు ఇది అదనమని ఆయన తెలిపారు. కొవ్యాక్సిన్, కోవిషీల్డ్ కలిపి మొత్తం 44 కోట్ల కరోనా టీకా డోసులు డిసెంబర్ నాటి కల్లా విడతల వారీగా అందుబాటులోకి వస్తాయి. టీకా ఖర్చులో దాదాపు 30 శాతం మొత్తాన్ని అడ్వాన్స్గా సీరం, భారత్ బయోటెక్‍కు విడుదల చేశాం అని తెలిపారు.