రాత్రి కర్ఫ్యూలు పెట్టండి.. రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలను ఉపక్రమించింది. కొత్త వేరియంట్ వేళ రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై రాష్ట్రాలు దృష్టి సారించాలని తెలిపారు. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రాకముందే ఆంక్షలు అమలు చేయాలని అన్నారు. ఈ ఆంక్షలు కనీసం 14 రోజులు అమల్లో ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా రాబోయే పండగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.













