కేంద్రం మరోసారి సుప్రీంకోర్టుకు …ఆయన ఆ పదవిలో ఉండరాదు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ మిశ్రా పదవీ కాలం పొడిగించాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. ఈ మేరకు తాజాగా పిటిషన్ వేసింది. పదవీకాలం పొడిగింపు విషయంలో ఇదివరకు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తాజా పిటిషన్‌ను పరిశీలించాలని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను లిస్ట్ చేసేందుకు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధిపతిగా నవంబర్ 2018లో సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. రెండేళ్ల తర్వాత ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ నవంబర్ 2020లో ఆయన పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. అనంతరం 2022లోనూ మూడోసారి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్‌తో పాటు పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు సంజయ్ మిశ్రా పొడిగింపు కుదరదని స్పష్టం చేసింది. జులై 31 తర్వాత ఆయన ఆ పదవిలో ఉండరాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఆలోపు ఈడీకి కొత్త అధిపతిని నియమించుకోవాలని కేంద్రానికి సూచించింది.













