కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావు: కేంద్ర మంత్రి

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం దక్కించుకోవాలని పగటి కలలు కంటోందని, కానీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కనీసం 40 సీట్లు కూడా రావడం డౌటేనని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం 400 పైగా సీట్లు సాధిస్తుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర సమాచారం, ప్రసారాలు, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్.. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడంపై ఆయన స్పందించారు.
గతంలో బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ జరిగినప్పుడు పోలింగ్ బూత్‌లను కాంగ్రెస్ లూటీ చేసిందని, కానీ ఈవీఎంల వల్ల పారదర్శకత పెరిగిందని, అందుకే కాంగ్రెస్ మళ్లీ బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ కోసం డిమాండ్ చేస్తోందన్నారు. ఇప్పటికే ఛత్తీస్‌ఘఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లతో పాటు అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని, ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదనే భయంతోనే కాంగ్రెస్ మళ్లీ బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలని డిమాండ్ చేస్తోందని అనురాగ్ ఠాకూర్ అన్నారు.