ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులకు అండగా కేంద్రం
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా స్వదేశం తిరిగొచ్చేసిన విద్యార్థులకు అండగా ఉంటామని కేంద్రం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ వైద్య విద్యార్థులకు ప్రత్యామ్నాయాలు కల్పించేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖలు కృషి చేస్తున్నాయని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ప్రత్యామ్నాయాలు కల్పించడంపై అత్యున్నత న్యాయస్థానంలో జరిగిన విచారణలో కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధులియా నేతృత్వంలోని ధర్మాసనం ముందు వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్.. తానే స్వయంగా మంత్రిత్వ శాఖలతో, అధికారులతో సంప్రదింపులు జరిపానని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చలు జరుపుతున్నట్లు వాళ్ళు చెప్పారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం.. కేసు తదుపరి విచారణ అక్టోబర్ 11కి వాయిదా వేసింది.













