కొత్త సిలబస్‌పై ఎన్సీఈఆర్టీ కీలక ప్రకటన
ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) కొత్త విద్యా సంవత్సరంలో సిలబస్ మార్పు, పాఠ్యపుస్తకాల విడుదలకు సంబంధించి గురువారం ఎక్స్ వేదికగా కీలక ప్రకటన విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఏఏ తరగతుల పాఠ్యపుస్తకాలు, సిలబస్‌లో మార్పు జరగబోతోందో ఈ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ ప్రకటన ప్రకారం.. 1, 2, 7, 8, 10, 12వ తరగతులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు, సిలబస్‌లో ఎలాంటి మార్పులూ లేవు. అయితే 3, 6వ తరగతులకు చెందిన పాఠ్యపుస్తకాల్లో కొత్త సిలబస్ ఉండబోతోంది. మారిన సిలబస్‌తో 3వ తరగతి పుస్తకాలు ఏప్రిల్ చివరి వారంలో, 6వ తరగతి పుస్తకాలు మే నెల రెండు, మూడు వారాల్లో విడుదలవుతాయని ఎన్సీఈఆర్టీ వెల్లడించింది. ఇక మారిన కరికులమ్‌కు అనుగుణంగా 6వ తరగతి విద్యార్థులను ప్రిపేర్ చేయాలని ఉపాధ్యాయులకు ఎన్సీఆర్టీ సూచనలు జారీ చేసింది. అందుకు అవసరమైన బ్రిడ్జ్ కోర్సును కూడా తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని పేర్కొంది.
‘‘పాఠశాల విద్య కోసం నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ 2023ని అనుసరించి 2024-25 విద్యా సంవత్సరంలో 3, 6 తరగతులకు మాత్రమే కొత్త పాఠ్య పుస్తకాలను తీసుకొస్తున్నాం. 3వ తరగతి పాఠ్య పుస్తకాలు ఏప్రిల్ చివరి వారంలో, 6వ తరగతి పాఠ్య పుస్తకాలు మే నెల మధ్యలో విడుదల చేస్తాం. ఇక 4, 5, 9, 11వ తరగతులకు సంబంధించిన బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే 4, 5, 9, 11వ తరగతులకు సంబంధించి 27.58 లక్షల పుస్తకాలు విడుదల చేశాం. వాటికి తోడు కొత్తగా మరో 1.03 కోట్ల కాపీల ప్రింటింగ్ కోసం ఆర్డర్ ఇచ్చాం. ఈ పుస్తకాలు మే 31 నాటికి అందుబాటులోకి వస్తాయి’’ అని ఎన్సీఈఆర్టీ తెలిపింది. అలాగే అన్ని పాఠ్య పుస్తకాల డిజిటల్ కాపీలు మా వెబ్‌సైట్‌తో పాటు diksha.gov.in/index.html, epathshala.nic.in పోర్టల్, యాప్‌లలో ఉన్నాయి. వాటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.













