సీబీఎస్‌ఈ 12 వ తరగతి పరీక్షలు రద్దు

దేశంలో సెకండ్ వేవ్ దృష్ట్యా సీబీఎస్‌ఈ పరీక్షలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీబీఎస్‌ఈ 12 తరగతి పరీక్షలను రద్దు చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యమే తమకు ముఖ్యమని ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత తమకు చాలా ప్రాధాన్యమని, ఈ అంశంలో మాత్రం రాజీపడబోమని మోదీ తేల్చి చెప్పారు. ఈ విషయంలోనే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, పరీక్షలకు విద్యార్థులు బలవంతంగా హాజరు కావాల్సిన అవసరమేమీ లేదని తేల్చి చెప్పారు. పరీక్షలు రాయాలనుకునే వారికి కరోనా తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించాలని, గతేడాది మాదిరిగానే ఆసక్తి ఉన్నవారికి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రస్తుత పరీక్షలు యువతీ, యువకులు ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసే విధంగా కారాదని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్, సీబీఎస్‌ఈ బోర్డు చైర్మన్ మనోజ్ అహుజాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పోఖ్రియాలో అనారోగ్య కారణాల రీత్యా ఆస్పత్రిలో ఉండడంతో ఈ సమావేశానికి హాజరు కాలేదు.